వీధివీధికీ విగ్రహాలు పెట్టే సంస్కృతికి సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. జనం రద్దీ ఎక్కువగా ఉండే రహదారుల వద్ద విగ్రహ ప్రతిష్ఠకు అనుమతి ఇవ్వరాదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు గట్టి ఆదేశాలు జారీచేసింది. కేరళలో జాతీయ రహదారిపై స్థానిక నేత విగ్రహ ప్రతిష్ఠాపణకు అనుమతి విషయమై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ ఆర్ఎమ్ లోధా, జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయల బెంచ్ కొట్టివేసింది. రద్దీ రహదారులపై కేరళ ప్రభుత్వం విగ్రహాలకు అనుమతి ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇప్పటికే దాదాపుగా విచారణ పూర్తయింది.
పిటిషన్‌ను పరిశీలించే క్రమంలో బహిరంగ స్థలాలు, రహదారులపై అనుమతి లేకుండా నిర్మించిన గుళ్లను, విగ్రహాలను తొలగించాలని బెంచ్ గట్టి ఆదేశాలు జారీచేసింది. తాజాగా మరికొంత ముందుకెళ్లి, ప్రజల రాకపోకలకు భంగకరంగా మారే విగ్రహాలకు అనుమతే వద్దని తేల్చిచెప్పింది. తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు యథాతథస్థితిని కొనసాగించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బహిరంగ ప్రజా స్థలాల్లో విగ్రహాలు పెట్టేందుకు ఇకపై మాత్రం ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని కేరళ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వీధి దీపాలు వంటి ట్రాఫిక్ ఉపయుక్త నిర్మాణాలను మాత్రమే అనుమతించాలని కోరింది. తాజా ఆదేశాలు కేరళ ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాదని, అన్ని రాష్ట్రాలూ కేంద్ర పాలిత ప్రభుత్వాలకూ వర్తిస్తాయని తేల్చిచెప్పింది.






















0 comments: